కరోనా వైరస్ మహమ్మారిని మరింత విస్తరించకుండా అడ్డుకునేందుకు ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా ఉన్న పలు జైళ్ల నుంచి ఆదివారం ఒక్కరోజే లక్ష మంది ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేసింది. మంగళవారం అధ్యక్షుడు హసన్ రౌహాని ఇచ్చిన ఆదేశాల మేరకు తాము ఏడేండ్ల లోపు శిక్ష పడిన ఖైదీలను విడుదల చేస్తున్నామని ఇరాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి గొలన్ హుస్సేన్ ఇస్మాయిలీ తెలిపారు.
అయితే, మార్చి మొదటి వారంలో కూడా 54 వేల మంది ఖైదీలను విడుదల చేశామని, అయితే ఆదివారం అంతకు రెట్టింపుగా లక్ష మంది ఖైదీలను రిలీజ్ చేశామని ఇస్మాయిలీ వెల్లడించారు. ఇదిలావుంటే ఇరాన్‌లో ఫిబ్రవరి 19న తొలి కరోనా కేసు బయటపడింది మొదలు ఇప్పటివరకు 38,300 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 12,300 మంది వైరస్ బారినుంచి పూర్తిగా కోలుకోగా.. మరో 2,640 మంది మృతిచెందారు.