ఇమ్మిగ్రేషన్ విధానాన్ని తాత్కాలికంగా 60 రోజుల పాటు స్పస్పెండ్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా ఉద్యోగస్తులను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. 60 రోజుల పాటు గ్రీన్ కార్డుల జారీ ఉండదన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వలసలను నిలిపేస్తున్నట్లు రెండు రోజుల క్రితం ట్రంప్ ప్రకటించారు. దానిపై మళ్లీ ఆయన క్లారిటీ ఇచ్చారు. వలసలకు బ్రేక్ ఇవ్వడం వల్ల.. ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్లను ఆదుకోవచ్చు అన్నారు. ఈ తాత్కాలిక నిషేధం 60 రోజుల పాటు ఉంటుందన్నారు. అయితే దేశ ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఆ తర్వాత నిషేధాన్ని ఎత్తివేయాలా లేక పొడిగించాలా అన్న అంశాన్ని ఆలోచిస్తామన్నారు. కేవలం పర్మనెంట్ రెసిడెన్స్ కావాలనుకుని, గ్రీన్‌కార్డులకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకే ఈ నియమం వర్తిస్తుందని ట్రంప్ తెలిపారు. తాత్కాలిక పద్ధతిలో దేశంలోకి వచ్చేవారికి ఈ నియమం చెల్లదన్నారు.
ఓ అదృశ్య శక్తి దాడి నేపథ్యంలో.. అమెరికన్ల ఉద్యోగాలు కాపాడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో అమెరికాలోకి తాత్కాలికంగా వలసలను నిషేధించే ఉత్తర్వులపై త్వరలో సంతకం చేయబోతున్నా అని ట్రంప్ సోమవారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులు గనుక కార్యరూపం దాల్చితే కొంతకాలం పాటు విదేశీయులెవరూ అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలైన హెచ్-1బీ, హెచ్4 వంటి వాటిపైనా నిషేధం విధించవచ్చని భావిస్తున్నారు. ట్రంప్ నిర్ణయం భారత్, చైనాకు పెద్ద ఎదురుదెబ్బ కానుంది.